Baahubali 2 The Conclusion Movie Review
బాహుబలి: ది కన్‌క్లూజన్ రివ్యూ
చిత్రం: బాహుబలి: ది కన్‌క్లూజన్
నటీనటులు: ప్రభాస్.. రానా.. అనుష్క.. తమన్నా.. రమ్యకృష్ణ.. సత్యరాజ్.. నాజర్ తదితరులు
ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్
కళ: సాబు సిరిల్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
నిర్మాతలు: ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ
సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి
విడుదల తేదీ: 28-04-2017
‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న ప్రశ్నతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. యావత్ సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు రాజమౌళి. తనదైన భావోద్వేగాలకు తోడు అత్యాధునిక సాంకేతికను జోడించి ‘బాహుబలి: ది బిగినింగ్’ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా తదుపరి చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’పై అంచనాలను మరింత పెంచేసింది. మరోవైపు ఐదేళ్ల పాటు మరే సినిమా చేయకుండా కేవలం జక్కన్న ‘బాహుబలి’ యజ్ఞంలో పాలుపంచుకున్నాడు ప్రభాస్. తనదైన నటనతో అకట్టుకున్నాడు. మరి.. ఐదేళ్ల రాజమౌళి, ప్రభాస్‌ల కృషి ఎంతవరకూ ఫలించింది? ‘బాహుబలి: ది బిగినింగ్’ మిగిల్చిన సందేహాలకు సమాధానాలు లభించాయా? రెండో భాగాన్ని మరింత భారీగా తీర్చిదిద్దామన్న చిత్ర బృందం మాటలు ఆ స్థాయిలోనే ఉన్నాయా? అన్నవి తెలియాలంటే ‘..కన్‌క్లూజన్’ చూడాల్సిందే.
కథేంటి..?: అమరేంద్ర బాహుబలి(ప్రభాస్)ని రాజమాత శివగామి(రమ్యకృష్ణ) మహారాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి సమయం ఉండటంతో దేశ పర్యటనకు బయలుదేరతాడు బాహుబలి. కుంతల రాజ్యానికి చేరుకున్న బాహుబలి ఆ దేశ యువరాణి దేవసేన(అనుష్క)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గర కావాలని మాహిష్మతి సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తినన్న విషయాన్ని దాచి ఓ అమాయకుడిలా నటిస్తాడు. కుంతల రాజ్యానికి ఆకస్మికంగా వచ్చిపడిన ఓ పెను ప్రమాదం నుంచి ఆ రాజ్యాన్ని కాపాడతాడు. ఈలోగా దేవసేన చిత్రపటాన్ని చూసిన భళ్లాలదేవుడు(రానా) ఆమెపై మనసు పడతాడు. ఆమెను సొంతం చేసుకోవడానికి వేసిన ఎత్తుతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అనూహ్య పరిణామాలతో దేవసేన మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది. అప్పుడేం జరిగింది? రాజ్యాన్ని విడిచి బాహుబలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పెంచిన చేతులతోనే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? తన తండ్రి మరణానికి కారణమైన భళ్లాలదేవుడిపై మహేంద్ర బాహుబలి(ప్రభాస్) ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే మిగిలిన కథ.
ఎలా ఉందంటే..‘బాహుబలి 1’ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు రాజమౌళి. దానికి పదిరెట్లు ‘బాహుబలి 2’పై శ్రద్ధపెట్టాడు. ప్రతి ఫ్రేములోనూ విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం కనిపిస్తుంది. దీంతోపాటు భావోద్వేగాల పరంగా పాత్రలను అంతేస్థాయిలో తీర్చిదిద్దాడు జక్కన్న. ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఒక పాత్ర బలంగా కనిపిస్తూ ఉంటుంది. తొలి భాగంలో కట్టప్ప చాలా సీరియస్‌గా కనిపిస్తాడు. ఈ భాగంలో కట్టప్ప చేత కూడా నవ్వులు పూయించాడు దర్శకుడు. కుంతల రాజ్యంలో జరిగే యుద్ధ ఘట్టం ప్రథమార్ధానికే హైలైట్‌గా నిలుస్తుంది. విశ్రాంతికి ముందు సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. భావోద్వేగ సన్నివేశాలను ఎంత బలంగా తెరపై చూపించడంలో తనకున్న పట్టును మరోసారి ప్రదర్శించాడు. పాటలు కథలో భాగంగా కలిసి సాగాయి. సుబ్బరాజుతో చేయించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. దీంతో తొలి సగంలోనే అన్నిరకాల భావోద్వేగాలను చూపించినట్లయ్యింది.
ఇక ద్వితీయార్ధంలో కథపైనే సినిమాను నడిపించాడు రాజమౌళి. తర్వాత ఏం జరుగుతుందోనన్న విషయం ప్రేక్షకుడికి తెలుస్తున్నా, దాన్ని ఎంత అందంగా, ఆకట్టుకునేలా ఉంటుందోనన్న ఆసక్తిని రేకెత్తించాడు. ప్రేక్షకుడిని సీటులో నుంచి కదలకుండా చేశాడు. ‘బాహుబలిని కట్టప్పను ఎందుకు చంపాడు’ అనే కీలక ఘట్టాన్ని చాలా బాగా చూపించాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క ముక్కలో లభించదు. పలు సన్నివేశాల సమాహారంగా కనిపిస్తూ.. ప్రేక్షకుడికి సంతృప్తినిస్తుంది. పతాక సన్నివేశాల్లో రాజమౌళి తన యుద్ధ నైపుణ్యాన్ని మరోసారి చూపించాడు. సుదీర్ఘంగా సాగే ఈ సన్నివేశాలు రోమాంచితంగా ఉంటాయి. మొత్తానికి ‘బాహుబలి 2’ పై సామాన్య ప్రేక్షకుడు ఎన్ని అంచనాలు పెంచుకున్నాడో వాటన్నింటినీ నిజం చేస్తూ తెరకెక్కించాడు రాజమౌళి.
ఎవరెలా చేశారంటే?: బాహుబలి పాత్రను ప్రభాస్ తప్ప మరెవరూ పోషించలేరన్న విషయం తొలి భాగంలోనే అర్థమైంది. రెండో భాగంలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు ప్రభాస్. భావోద్వేగ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని నిరూపించాడు. శివగామిగా రమ్యకృష్ణ పాత్ర ప్రేక్షకుడి మదిలో చిరకాలం నిలిచిపోతుంది. కన్నకొడుకు ఒకవైపు.. పెంచిన కొడుకు మరోవైపు.. వీరిద్దరి మధ్య నలిగిపోతూ భావోద్వేగాలు పలికించిన తీరు అమోఘం. తొలిభాగంలో డీగ్లామర్ పాత్రకు పరిమితమైన అనుష్క ఆ లోటును రెండో భాగంలో భర్తీ చేసింది. వీర నారిగా కనిపిస్తూ తన ఎంపిక తప్పుకాదని నిరూపించింది. అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. బిజ్జలదేవగా నాజర్ క్రూరత్వాన్ని అద్భుతంగా పలికించారు. ప్రాణవాయువుగా నిలిచిన భళ్లాలదేవుడు పాత్ర పరిధి కాస్త తక్కువైనా రానా తనవంతు అద్భుతంగా నటించాడు. కట్టప్ప బాహుబలిని చంపిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకుడు మరిచిపోలేడు. తమన్నా పాత్ర పరిమితంగా ఉంటుంది. మొత్తం చిత్రమంతా కనిపించిన పాత్రల్లో కట్టప్ప పాత్ర ఒకటి. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా కీరవాణి సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. యుద్ధ ఘట్టాల సమయంలో వచ్చే నేపథ్య సంగీతాన్ని థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకుడికి గుర్తిండిపోతుంది. విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాను నిలబెట్టాయి. మొత్తంగా 24 విభాగాలనూ ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన తెలుగు సినిమాగా ప్రేక్షకుడు అనుభూతి పొందుతాడు. ఒక సినిమాలో ఇన్ని బలమైన పాత్రలను మరోసారి చూడలేమేమోనన్న రీతిలో చూపించాడు జక్కన్న.
బలాలు
+ భావోద్వేగాలు
+ యుద్ధ ఘట్టాలు
+ కళ్ల చెదిరే విజువల్ ఎఫెక్ట్స్
+ బలమైన పాత్రలు
చివరిగా: క్లాసిక్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న ‘బాహుబలి’
*********************************************************************************గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
**********************************************************************************
Comments
Post a Comment