Adivasi Castes in Adilabad
ఆదివాసీలపై కొత్త కుట్రలు
******************************************
ఈ ఏప్రిల్ 1న ఆదివాసీ చట్టాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ’ గొడుగు కింద నాలుగుజిల్లాలకు సంబంధించిన పాత ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో బహిరంగ సమావేశం జరిగింది. దీనికి ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నిరుద్యోగులుగాక, అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ, లోక్‌సభ సభ్యులు, మంత్రులు, ఇతరనాయకులు అధికంగా హాజరుకావడం వివాదాలకు తావు ఇస్తున్నది.
ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో ఆదివాసులు ఆదివాసేతరుల మధ్య చిచ్చు రగులుకుంటున్నది. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఆశించి, గత కొంతకాలంగా స్తబ్ధంగా ఉన్న డిమాండ్‌లను తెరపైకి తెచ్చి ఆదివాసులే లక్ష్యంగా ఏజెన్సీ చట్టాలను తొలగించాలని ఆదివాసేతరులను ఉద్యమానికి రెచ్చగొడుతున్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ఐదవ షెడ్యూల్ నుంచి తెలంగాణలోని గిరిజన ప్రాంతాలను తొలగించాలనీ, తమ భూముల క్రమబద్ధీకరణకు అడ్డుగా ఉన్న 1/70 చట్టాన్ని రద్దుచేయాలని ఆదివాసేతరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఏప్రిల్ 1న ఆదివాసీ చట్టాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాజకీయ బేహారులు ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ’ గొడుగు కింద నాలుగుజిల్లాలకు సంబంధించిన పాత ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో బహిరంగ సమావేశం నిర్వహించారు. దీనికి ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు, రాజకీయ నిరుద్యోగులు హాజరవుతే పరవాలేదు, కానీ అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ, లోక్‌సభ సభ్యులు, మంత్రులు, ఇతరనాయకులు అధికంగా హాజరుకావడం వివిధ వివాదాలకు తావు ఇస్తున్నది. దానిలో ఆదివాసీ, గిరిజన నాయకులు ముందు వరసలో నిలబడి ‘గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు కావున ఏజెన్సీ చట్టాలను సమీక్షించవలసి అవసరముందని తాము ముఖ్యమంత్రికి నివేదిస్తామని, అవసరమైతే గవర్నర్ సహాయంతో సమస్యను రాష్ట్రపతిదృష్టికి తీసుకవెళ్తామని’ సభనుద్దేశించి మాట్లాడారు. ఎన్నడూ ఆదివాసీ రక్షణలైన 1/70చట్టం అమలు గురించి మాట్లాడని నాయకులు వారి రక్షణల రద్దుకై పోరాడతామనడం బాధాకరం. అసలు సభే అధికార పార్టీ అండతో జరిగిందనే ఒక వాదన బలంగా వినిపిస్తున్నది. గతంలో ముఖ్యమంత్రి షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టసవరణకై ఆదివాసీ నాయకులతో సంప్రదింపులు జరిపినపుడు అధికార పార్టీ నాయకులు సముఖత వ్యక్తం చేసారు. కాని ఖమ్మం నుంచి సున్నం రాజయ్య లాంటి నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. కావున అధికార పార్టీయే వ్యూహంగా ఏజెన్సీలో బీసీ, ఎస్సీ, మైనార్టీలను ఆర్గనైజ్ చేస్తున్నది. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులను ఆర్గనైజ్‌చేసి, సభలుపెట్టే యోచనలో ప్రభుత్వం కనిపిస్తున్నది. ఈ ఓటు బ్యాం కును వ్యూహాత్మకంగా తమకు అనుకూలంగా మార్చుకో చూస్తున్నది. ఐదవ షెడ్యూల్ రద్దే లక్ష్యంగా సాగుతున్న అధికార పార్టీ ప్యూహాన్ని ఆదివాసులు బద్దలు చేయకపోతే వారి బతుకు అగాధంలో కూరుకపోవడం ఖాయం.
1/70 చట్టాన్ని నేటికీ ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో అమలుజరుపలేదు. కాని ఆ చట్టం రద్దు దిశగా ఆదివాసేతరులు కదలడం విచారకరం. చరిత్రలో ఆదివాసుల భూములు అక్రమంగా అన్యాక్రాంతం అవుతూనే ఉన్నాయి. దీనికి ప్రతిఘటనగా ఆదివాసులు నిత్యం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఫలితంగా పూర్వపు బ్రిటీష్ ఇండియాలో ఆదివాసుల భూముల రక్షణ కోసం 1917 ఏజెన్సీ ట్రాక్ట్స్ ఇంటరెస్ట్ అండ్ లాండ్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్‌ను అమలుపర్చింది. దీని ప్రకారం ఏజన్సీ ప్రాంతంలో ఆదివాసేతరులకు భూములపై ఎలాంటి చట్టబద్ధ హక్కులు ఉండవు. కొమురం భీం అమరత్వం తరువాత హైదరాబాద్ స్టేట్‌లో ట్రైబల్ ఏరియాస్ రెగ్యులేషన్ (దస్తూర్-అల్-అమల్ 1356 ఫసలీ) ఏర్పాటైంది. స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టం ట్రైబల్ ఏరియాస్ రెగ్యులేషన్ 1949 నుంచి అమల్లోకి వచ్చింది. తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో విలీనమైనపుడు ఈ చట్టానికి తూట్లు పొడవడం జరిగింది. 1963లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ‘లాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ ఆక్ట్ 1959’ని తెలంగాణకు వర్తించే విధంగా విస్తృతపర్చారు. వలస పాలనలో ఎన్నడూ ఈ చట్టం అమలుజరిగింది లేదు. ఇంకా చట్టం రద్దుకు కూడా ప్రయత్నించింది. వెంటనే ఆదివాసుల తిరుగుబాటుకు చలించి 1970లో 1/70 చట్టాన్ని తెచ్చింది. నేటివరకు అడపాదడపా ఈ చట్టం రద్దుకు ఆదివాసేతరులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
జిల్లాల పునర్విభజన తరువాత ఆదిలాబాద్ నాలుగు జిల్లాలుగా చీలిపోయింది. వాస్తవంగా జిల్లాను విభజించడం వల్ల ఆదివాసులు మైనార్టీలు అయ్యారు. జిల్లాను విభజిస్తే ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని గతంలో ఈ వ్యాసకర్త వాదించారు. కాగా ఆదివాసేతరులు మెజార్టీగా మారి గిరిజన చట్టాలను సమీక్షించాలని తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికంటే విషాదం ఏముండదు. ఆదివాసేతరులు ఏజెన్సీలో బతకడం అనేది ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత, వివక్షాపూరిత ధోరణికి తార్కాణం, ‘ఆదివాసీ చట్టాలు అమలుపర్చకపోవడం వలన’ వారికి వచ్చిన గొప్ప అవకాశం. మరి వలసవచ్చిన మైదాన ప్రాంత ప్రజలు ఆదివాసులపట్ల సహానుభూతి లేకున్నా సానుభూతితో వ్యవహరించాలి. ఇవేవీ లేకుండా వారికి రక్షణగా ఉన్న చట్టాలను తొలగించాలని ప్రయత్నిస్తున్నారు. ఇవాళ వీరు అనుభవిస్తున్న భూములు గతంలో ఆదివాసులు సాగు చేసుకున్న భూములే. పోడు వ్యవసాయం అవలంబిస్తున్న ఆదివాసుల భూములను ఆక్రమించుకొని వారిని ఇంకా లోతట్టు ప్రాంతాలైన భీకరమైన అడవుల్లోకి తరమడం వల్ల ఏర్పడిన ఖాళీలో ఆదివాసేతరులు పాగా వేశారు. అంతేకాకుండా ఆదివాసేతరులు ఇష్టానుసారంగా అడవిని నరికి భూములను సాగుచేసుకున్నారు. వీరికి అటవీ, రెవెన్యూ సిబ్బంది అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అదే పని ఆదివాసీ చేస్తే నేరమైంది. ఎక్కడలేని శిక్షలు ఇక్కడ అమలుపర్చారు. లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లిన ఆదివాసీ అడవిని కొట్టి భూమిని సాగుచేసుకుందామంటే అటవీ సిబ్బంది ఇది అటవీ భూమి అని, రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ భూమి అని చెప్పరాని బాధలకు గురిచేశారు. వీరి మధ్య ఆదివాసీ నేటికి కొట్టుమిట్టాడుతున్నాడు.
వలస ఆదివాసేతరులకు బతుకునిస్తే ఆదివాసులకు దుర్భర దారిద్య్రాన్ని ఇచ్చింది. దారిద్య్రంలోంచి ఎగిసిపడిన పోరాట శకలాలకు కొన్ని రక్షణలు వచ్చాయి. 1/70 కానీయండి, పెసా చట్టాలే కానీయండి, ఏజెన్సీ రక్షణలే కానీయండి. ఒకింత ఒదార్పుగా ఉన్న చట్టాలను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమే. ఏజెన్సీలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించి క్రమబద్ధీకరణ పెద్ద సమస్యగా పరిగణిస్తున్న ఆదివాసేతరులు ఏజెన్సీ చట్టాలున్నాయని తెలిసి రిజిష్ట్రేషన్ లేకుండానే క్రయ విక్రయాలు గతంలో జరిపారు. ఇపుడు జరుపుతున్నారు. ఇక్కడ 1/70 అమలు జరిగింది ఎక్కడ? ఏజెన్సీలో ఇతర ప్రయోజనాలు పొందుతూ ఆ ఏజెన్సీ చట్టాలు రద్దు చేయమనడం వారి వివక్షాపూరిత వైఖరికి నిదర్శనం. ఇంకా ఇక్కడ బాధాకర విషయమేమంటే, లంబాడాలు ఏజెన్సీ చట్టాల రద్దును బలంగా కోరుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తున్నది. లంబాడాలు 1976 తరువాత గిరిజనులుగా గుర్తించబడ్డారు. అదే సందర్భంలో ఏజెన్సీ చట్టాల బలహీనతలనుపయోగించుకొని పొరుగున మహారాష్ట్రలో బీసీలుగా ఉన్న లంబాడాల వలస అధికమైంది. వీరు ఆక్రమించిన భూములన్నీ దాదాపు క్రమబద్ధీకరణ చెందాయి. 1976 తరువాత వలసవచ్చిన లంబాడాలు ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా నివసిస్తూ ఉన్నారు. సహజంగానే 1976కు పూర్వం ఉన్న లంబాడాలు ఎస్టీలుగా గుర్తింపబడతారు (వీరిశాతం ఈ జిల్లాలో రెండు శాతానికి మించదు). అప్పుడున్న వారి భూములే క్రమబద్ధీకరించబడుతాయి. కాని, వీరి వలసలు నేటికి కూడా నిరోధించబడడం లేదు. నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. కావున వీరి భూముల క్రమబద్దీకరణకు 1/70 లాంటి చట్టాలు అడ్డుగా ఉన్నాయి. అందుకే వాటి రద్దుకు పూర్తి మద్దతునిస్తున్నారు.
ఈ చట్టాలు వాటంతట అవే రూపొందలేదు. వాటి వెనుక తీవ్రమైన మానవ సంఘర్షణ ఉన్నది. నెత్తుటిలో తడిసిన ప్రాణాలున్నాయి. అవి ఎంతకు అమలుకాని చట్టాలైనా వాటి అమలు కోసం నిరంతర తపనతో కొట్లాడే ప్రజ ఉన్నది. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తే అతి పెద్ద ప్రజాస్యామ్యమని చెప్పుకుంటున్న భారతదేశం అపహాస్యం కాకుండా నిలబెడుతున్నది. ఆదివాసులు ప్రభుత్వ మెడలు వంచడానికి కొత్త పోరాట రూపాలను ఎంచుకుంటారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
Comments
Post a Comment